కరీంనగర్‌ గడ్డపై ‘మహా పాదయాత్ర’ కదనభేరి

కలం, కరీంనగర్ బ్యూరో: ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కీలక వేదికైన కరీంనగర్‌ గడ్డపై బీజేపీ మరోసారి తన క్షేత్రస్థాయి బలాన్ని, సంస్థాగత పట్టును ప్రదర్శించింది. దేశవ్యాప్తంగా ‘సర్’ కు మద్దతుగా 40 ప్రాంతాల్లో తలపెట్టిన కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘మహా పాదయాత్ర’ (BJP Maha Padayatra)కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ హాజరయ్యారు. స్వల్ప వ్యవధిలో ఖరారైన ఈ పర్యటనకు లభించిన స్పందన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

యాత్ర పొడవునా స్వాగతం..

సాధారణంగా జాతీయ స్థాయి నేతల పర్యటనలకు వారాల తరబడి సన్నాహాలు జరుగుతుంటాయి. అయితే ఈ పాదయాత్ర షెడ్యూల్‌ కేవలం మూడు రోజుల ముందే ఖరారైనప్పటికీ భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలిరావడం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. గాంధీ చౌక్‌ నుంచి వైశ్యా భవన్‌, రాజీవ్‌ చౌక్‌, టవర్‌ సర్కిల్‌, శాస్త్రీ రోడ్‌ మీదుగా కమాన్‌ సెంటర్‌ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో లక్ష మందికి పైగా పాల్గొన్నట్లు నిర్వాహకులు, పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డప్పు చప్పుళ్లు, ఆటపాటల మధ్య గంటా 45 నిమిషాల పాటు సాగిన యాత్ర కమాన్‌ చౌరస్తా వద్ద జాతీయ జెండా ఆవిష్కరణతో ముగిసింది. యాత్ర పొడవునా ఇళ్లు, భవనాలు, వ్యాపార సముదాయాల పైకెక్కి ప్రజలు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలకడం కనిపించింది.

జాతీయత–స్థానికతల మేళవింపు..

ఈ పాదయాత్రలో జాతీయవాద, హిందుత్వ నినాదాలతో పాటు జాతీయ జెండాలు, కాషాయ జెండాలను యువత, మహిళలు చేతబూని నడవడం ప్రత్యేకంగా నిలిచింది. కమాన్‌ వద్ద జాతీయ జెండా ఎగురవేయడం ద్వారా తమ కార్యాచరణను విస్తృత ప్రజాదృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

నాయకత్వ ప్రశంసలు.. రాజకీయ లెక్కలు..

ఇప్పటివరకు హైదరాబాద్‌ సహా దేశంలోని 13 చోట్ల జరిగిన మహా పాదయాత్రలన్నింటికంటే కరీంనగర్‌ యాత్రకు అత్యధిక స్పందన లభించిందని బీజేపీ పరిశీలకులు, సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. పాదయాత్ర అనంతరం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌజ్‌లో విశ్రాంతి తీసుకున్న నితిన్‌ నబిన్‌, సాయంత్రం 4:45 గంటలకు కలెక్టరేట్‌ హెలిప్యాడ్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరారు.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ను ఆలింగనం చేసుకుని, తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అభినందనీయమని, కార్యకర్తల ఉత్సాహం, ప్రజా స్పందన మర్చిపోలేని అనుభూతినిచ్చాయని ప్రశంసించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ​కరీంనగర్‌ను తమ కంచుకోటగా భావిస్తున్న బీజేపీకి, జాతీయ అధ్యక్షుడి పర్యటన మరియు అందుకు లభించిన ప్రజా స్పందన రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయ సమీకరణలు, ఎన్నికల వ్యూహాల పరంగా కీలక పరిణామంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>