నిమ్స్‌లో అవ‌క‌త‌వ‌క‌లు.. ఏసీబీ త‌నిఖీల్లో కీల‌క ఆధారాలు

క‌లం, వెబ్‌డెస్క్‌: కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లోని నిమ్స్‌ (NIMS)లో జ‌రిగిన ఏసీబీ త‌నిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇప్ప‌టికే నిమ్స్ డాక్ట‌ర్ ల‌క్ష్మీ భాస్క‌ర్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరుక్కున్నారు. ఆయ‌న‌కు కోట్లాది అక్ర‌మాస్తులు ఉన్న‌ట్లు ఏసీబీ విచార‌ణ‌లో తేలింది. ఇక ఆ ఘ‌ట‌న అనంత‌రం నిమ్స్‌లో మ‌రోసారి త‌నిఖీలు నిర్వ‌హించిన‌ ఏసీబీ అధికారులు పలు అవకతవకలను గుర్తించిన‌ట్లు వెల్ల‌డించారు. అక్టోబర్ 29, నవంబర్ 2వ తేదీల్లో ఏసీబీతో పాటు టీజీ సేఫ్‌ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలు చేపట్టాయి. 2019–2025 మధ్య మ్యాన్ పవర్ నియామకాలు, కార్మికుల కేటగిరీల మార్పులు, టెండర్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు, ప‌లు అవినీతి వ్యవహారాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మెయిన్‌ క్యాంటీన్‌లో అపరిశుభ్ర వాతావరణం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రిజిస్ట్రేషన్ లేకపోవడం, కార్మిక చట్టాల ఉల్లంఘనలు ఉన్నట్లు వెల్లడించారు. మెడికల్ షాపుల్లో రికార్డులు నిర్వహించకపోవడంతో పాటు, రిజిస్టర్ కాని సిబ్బందిని నియమించినట్లు గుర్తించారు.

సెక్యూరిటీ సేవల టెండర్ల‌ ఖరారులో ఆల‌స్యం చేయ‌డంతో పాటు, కాంట్రాక్టుల పొడిగింపులు జరిగినట్లు వెల్ల‌డించారు. అలాగే డిఫాల్ట్ అయిన ఏజెన్సీకి చెందిన రూ.28.13 లక్షల బ్యాంకు గ్యారెంటీని జప్తు చేయలేదని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఆపరేషన్ థియేటర్ల సమీపంలో సుమారు రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్లు, ఇతర వైద్య సామగ్రిని అనుమతి లేకుండా నిల్వ చేసినట్లు గుర్తించారు. వినియోగించినట్లు చూపిస్తూ యుటిలిటీ సర్టిఫికెట్ల ఆధారంగా బిల్లులు సమర్పించే విధానంలో అక్రమాలకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. రోగులు డిశ్చార్జ్ అయిన తర్వాత, మరణించిన మూడు నెలల తర్వాత కూడా బిల్లులు ప్రాసెస్ చేసిన ఉదంతాలు ఉన్నాయని, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో డిశ్చార్జ్ అయిన రోగులకు సంబంధించి సుమారు రూ.66 లక్షల బిల్లులు త‌ర్వాత‌ నమోదు చేసినట్లు వెల్లడించింది. ఈ తనిఖీల సందర్భంగా నోట్ ఫైళ్లు, ఒప్పంద పత్రాలు, ఇతర కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ ఆధారాల ప్ర‌కారం త‌దుపరి చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>