కలం, యాదగిరిగుట్ట : కార్తీక పౌర్ణమి (Kartika Purnima) పర్వదినం.. ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే మహాపర్వం ఈ పుణ్యదినాన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో భక్తిభావం వెల్లివిరియనుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో యాదాద్రి దేవస్థానం అప్రమత్తమైంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసింది.
తెల్లవారుజామున 5 గంటల నుంచే వ్రతాలు..
కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 24, మంగళవారం ఉదయం 5 గంటల నుంచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ప్రారంభించనున్నారు. పౌర్ణమి పర్వదినాన స్వామివారి వ్రతం ఆచరిస్తే శుభఫలితాలు కలుగుతాయని విశ్వసించే భక్తులు పెద్ద సంఖ్యలో వ్రతాలు నిర్వహించుకునేందుకు యాదాద్రికి చేరుకునే అవకాశం ఉంది. ఇందుకోసం వ్రత మండపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. పూజలకు అవసరమైన సామగ్రిని ముందుగానే సిద్ధం చేశారు.
గత అనుభవాలతో ముందస్తు అప్రమత్తత..
గత ఏడాది కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పడిన భక్తుల రద్దీతో పాటు, ఈ ఏడాది కార్తీక మాసంలోని ప్రతి శని, ఆదివారాలు, సెలవు దినాల్లో యాదాద్రికి పోటెత్తిన భక్తజనాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈసారి ముందస్తు కార్యాచరణ రూపొందించారు. వ్రతాల నిర్వహణలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా, భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించారు.
క్షేత్రస్థాయిలో ఏర్పాట్ల పరిశీలన..
దేవస్థానం కార్యనిర్వహణాధికారి స్వయంగా వ్రత మండపాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, పూజా సామగ్రి, వ్రతాల నిర్వహణకు సంబంధించిన అంశాలను సమీక్షించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. పర్వదినం సందర్భంగా భక్తులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

