కలం, ఖమ్మం బ్యూరో: అతితక్కువ వేతనాలతో కుటుంబాలను పోషించుకోలేక, మరోవైపు అంగన్వాడీ కేంద్రాల అద్దెలను సొంత డబ్బులతో కట్టలేక ఆయాలు (Anganwadi Helpers)తీవ్ర ఆర్థిక అవస్థలు పడుతున్నారని ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు గోనె మణి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కొత్తగూడెంలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం ‘శేషగిరిభవన్’లో జరిగిన అసోసియేషన్ జిల్లా బాధ్యుల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
కేవలం ఆయాలుగా పనిచేస్తున్నారనే కారణంతో వారికి ప్రభుత్వ పెన్షన్ సౌకర్యం కల్పించకపోవడం ఏమాత్రం సరికాదని ఆమె పేర్కొన్నారు. చాలీచాలని వేతనాలతో బతుకులు భారమయ్యాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆయాలకు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు ఏడాది కాలంగా ప్రభుత్వం అద్దెలు చెల్లించకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
బకాయిలు రాకపోవడంతో భవన యజమానుల ఒత్తిడి తట్టుకోలేక సిబ్బందే సొంత డబ్బులతో అద్దెలు చెల్లిస్తూ తీవ్ర ఆర్థిక భారంతో సతమతమవుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఇంటి అద్దెలను విడుదల చేసి, కేంద్రాల నిర్వహణకు ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు కమల, భవాని, రమ, లక్ష్మి, గుణ, నీలవేణి, షహనాజ్ తదితరులు పాల్గొన్నారు.

