కలం, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి హరీశ్ రావు కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. పల్నాడు ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పల్నాడు ప్రాజెక్టుకు సంబంధించి తమ దృష్టికి రాగానే అధికారులతో, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కృష్ణా రివర్ బోర్డును సంప్రదించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రంతో పాటు, కృష్ణా బోర్డుకు కూడా ఫిర్యాదు చేశారన్నారు. అభ్యంతరాలు ఉన్న ప్రాజెక్టులు కట్టి రెండు రాష్ట్రాల మధ్య విబేధాలు పెంచొద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా సిద్ధిపేట కేంద్రంగా ఇటీవల సీఎం రేవంత్ మాట్లాడిన మాటలను గుర్తు చేశారు. 2004లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో హరీశ్ రావు సహా ఆరుగురు మంత్రులుగా ఉన్నారని, నాయిని నర్సింహా రెడ్డి కడప జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడుకు సంబంధించిన అనుమతులు కూడా ఇచ్చారని చెప్పారు. 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కుల తరలింపునకు హారతిచ్చి అనుమతులు ఇచ్చారన్నారు. దీనిపై హరీశ్ రావు స్పందిస్తూ సెప్టెంబర్‌లో ఈ జీవో వచ్చిందని, జూలైలోనే తాము రాజీనామా చేశామని చెప్పారని, ఈ జీవో కారణంగానే రాజీనామా చేశామని చెప్పారన్నారు. 2005లో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులు, ఆ తర్వాత ప్రాజెక్టుల గురించి విడుదలైన జీవోలను సీఎం రేవంత్ బయటపెట్టారు.
ఈ బడ్జెట్ ఆమోదం జరిగినప్పుడు హరీశ్ రావు, నాయిని నర్సింహారెడ్డి, లక్ష్మీకాంత రావు, సంతోష్ రెడ్డి, చంద్రశేఖర్, విజయ రామారావు వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రులని, వారు ఆమోదించిన తర్వాతే జీవో వచ్చిందని చెప్పారు. ఆరోజు నిలదీయకుండా ఇప్పుడు మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ వచ్చినప్పుడు మేం మంత్రులుగా లేమని హరీశ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అ బద్ధమన్నారు. పోతిరెడ్డి పాడుకు 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెరగడానికి 2005-06 బడ్జెట్ ఆమోదమే కారణమన్నారు. కడప జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉండి వైఎస్ఆర్ మోచేతి నీళ్లు తాగి నాడు కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టారన్నారు. ఆ రోజుల్లోనే రూ.1250 కోట్లతో దీనికి అనుమతులు ఇచ్చారన్నారు.
పోతిరెడ్డిపాడుకు నీటి తరలింపు ముమ్మాటికి హరీశ్ రావు చేసిన ద్రోహమేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. వార్డు మెంబర్ కాకపోయినా హరీశ్ రావును మంత్రిగా తీసుకున్నందుకు వైఎస్ఆర్కు గురుదక్షిణ చెల్లించుకున్నారన్నారు. హరీశ్ రావుకు నిజమైన గురువు కేసీఆర్ కాదని, వైఎస్ఆర్ అని సీఎం రేవంత్ అన్నారు. ముందు వైఎస్ఆర్ ఆయన మంత్రివర్గంలో మంత్రిని చేసిన తర్వాత ఆయన మద్దతుతో హరీశ్ మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. దీనికి గురు దక్షిణ కింద కృష్ణా నది జలాలను హరీశ్‌రావు రాజశేఖర్ రెడ్డికి తాకట్టు పెట్టారన్నారు. హరీశ్ రావు మంత్రి అయ్యాక 2004లో 40 టీఎంసీలు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి తరలించేందుకు కూడా జీవో ఇచ్చారన్నారు.

