కలం, వెబ్ డెస్క్ : నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ‘పల్నాడు వాటర్‌గ్రిడ్’ (Palnadu Water Grid) సొరంగ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (KRMB) అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కూడిన బృందం బోర్డు సమావేశంలో అధికారులను కలవడానికి వెళ్తున్న వేళ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్‌లను పోలీసులు సోమవారం వారి నివాసాల్లోనే హౌస్ అరెస్ట్ (BRS Leaders Arrest) చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నల్గొండ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వాహనాన్ని పోలీసులు చిట్యాల వద్ద అడ్డుకున్నారు. దీంతో భూపాల్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ వెళ్లాలంటే వీసా తీసుకోవాలా..? అంటూ పోలీసులపై భూపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. శాంతి భద్రతల సమస్య ఉందని ఆయన వెళ్లేందుకు పోలీసులు నిరాకరించారు. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించింది.
అయితే అంతర్రాష్ట్ర నదీజలాల ఒప్పందాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం సాగర్ నుంచి నీటిని తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాల వల్ల హైదరాబాద్ భవిష్యత్తు తాగునీటి అవసరాలకు, తెలంగాణ నీటి హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ అంశంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యులను కలిసి ఫిర్యాదు చేసేందుకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో ఎర్రమంజిల్‌లోని జలసౌధ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం జలసౌధ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఫిబ్రవరి నెల టికెట్లు వచ్చేశాయ్!
Follow Us On : WhatsApp

