కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి (Annapureddipalle) మండలంలో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై విజయ్ సింహారెడ్డి వివరాల ప్రకారం.. గుంపెన హెచ్ కాలనీ సమీపంలోని ఓ జామాయిల్ తోటలో కొందరు పేకాట ఆడుతున్నట్లు ఆదివారం పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఎస్సై, తన సిబ్బందితో కలిసి సదరు తోటపై దాడి చేశారు. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారయ్యాడు. నిందితుల నుంచి రూ.3,800 నగదు, మూడు ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కానిస్టేబుల్స్ సురేష్, సలీం పాల్గొన్నారు.

