యాదాద్రికి రికార్డు స్థాయిలో త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు!

కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి క్షేత్రం (Yadadri Temple) భక్త జన సంద్రంగా మారింది.. కార్తీక మాసం రెండవ ఆదివారం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కొండపై అడుగుపెట్టేందుకు భక్తుల ఉత్సాహం.. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో నిరీక్షణ.. ఎటుచూసినా నరసింహ నామస్మరణ! కార్తీక పౌర్ణమికి ఇంకా ముందే యాదాద్రిలో కనిపించిన భక్తుల వెల్లువ రెండు తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక్కరోజులోనే 80,400 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందో చాటిచెప్పింది.

80 వేల మందికి పైగా దర్శనం..

కార్తీక మాస పవిత్రత, ఆదివారం సెలవు దినం కలిసిరావడంతో తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మొత్తం 80,400 మందిలో 69,487 మంది ధర్మదర్శనం, 9,585 మంది ప్రత్యేక దర్శనం, 1,328 మంది బ్రేక్ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ధర్మదర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్యే అత్యధికంగా ఉండటం విశేషం. భక్తుల రద్దీ తీవ్రతను గుర్తించిన దేవస్థానం అధికారులు మధ్యాహ్నం వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసి లఘు దర్శనాలకు ప్రాధాన్యత కల్పించారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం అనంతరం రూ.150 ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా ధర్మదర్శన భక్తులను కూడా ప్రత్యేక క్యూలైన్లలోకి పంపించారు. దీంతో నిరీక్షణ సమయాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు.

క్యూలైన్లలో ఈఓ పర్యవేక్షణ..

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కార్యనిర్వహణాధికారి స్వయంగా దర్శన క్యూలైన్లు, ఆలయ పరిసరాలను పరిశీలించారు. క్యూలైన్ల కదలికలను పర్యవేక్షిస్తూ భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులకు సూచనలు చేశారు. పౌర్ణమి రోజున రద్దీ మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో ఇప్పటి నుంచే ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. కార్తీక దీపాలతో యాదాద్రి కొండ మరో ఆధ్యాత్మిక లోకాన్ని తలపించింది. మాడవీధుల ప్రాంగణం, శివాలయం సమీపంలోని దీపాల ప్రాంగణాల్లో భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. దీపాల కాంతులు, భక్తుల నామస్మరణ, స్వామివారి దర్శనంతో ఆలయ పరిసరాలు భక్తిపారవశ్యంలో మునిగిపోయాయి.

నవంబర్ 24న అసలు పరీక్ష!

రెండవ ఆదివారం 80,400 మంది భక్తులు తరలిరావడంతో ఈ నెల 24న జరగనున్న కార్తీక పౌర్ణమి ఉత్సవాలపై ఆసక్తి పెరిగింది. పౌర్ణమి రోజున భక్తుల తాకిడి మరింత అధికంగా ఉండే అవకాశం ఉండటంతో దర్శనాలు, వ్రతాలు, క్యూలైన్లు, కార్తీక దీపాల ప్రాంగణాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లకు దేవస్థానం అధికారులు కసరత్తు చేస్తున్నారు. 80,400 మంది భక్తుల రాకతో యాదాద్రి క్షేత్రం మరోసారి తన ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుకుంది. అయితే పౌర్ణమి రోజున లక్షలాది భక్తులు వస్తారనే అంచనాల నేపథ్యంలో భక్తులకు సులభమైన దర్శనం, క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా సదుపాయాల కల్పన దేవస్థానం ముందున్న కీలక బాధ్యతలుగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>