సంగారెడ్డిలో నేచురల్ బర్తింగ్ అవగాహన వాక్

కలం, మెదక్ బ్యూరో: సహజ ప్రసవాల ప్రాముఖ్యతను చాటిచెప్పడంతో పాటు మహిళలు, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సొసైటీ ఆఫ్ మిడ్‌వైవ్స్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో నేచురల్ బర్తింగ్ (Natural Birthing) అవగాహన వాక్ నిర్వహించారు. ఇందులో భాగంగా సంగారెడ్డిలోనూ భారీ వాక్ చేపట్టారు. కార్యక్రమ సమన్వయకర్త, సంగారెడ్డి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రొఫెసర్ విజయకుమారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఐ.బి. వరకు ఈ వాక్ కొనసాగింది. ఈ సందర్భంగా సహజ ప్రసవం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత కలిగినదని, అనవసర సిజేరియన్ ప్రసవాలను తగ్గించేందుకు సహజ ప్రసవాలపై అవగాహన పెంపొందించడం అవసరమని పేర్కొన్నారు.

గర్భధారణ సమయంలో సమతుల్య పోషకాహారం తీసుకోవడం, తగిన శారీరక చురుకుదనం, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం, మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవడం, నిపుణులైన వైద్య సిబ్బంది మార్గదర్శకత్వం పొందడం సహజ ప్రసవానికి దోహదపడతాయని వివరించారు. తల్లి, బిడ్డ ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా ప్రతి గర్భిణికి సరైన అవగాహన కల్పించడంతో పాటు గౌరవప్రదమైన ప్రసవ సంరక్షణ అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బంది, కుటుంబ సభ్యులు, సమాజంపై ఉందని తెలిపారు.

ఈ అవగాహన వాక్‌లో సంగారెడ్డి, ఆందోల్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు, ఎం.ఎన్.ఆర్. నర్సింగ్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, వైద్య సిబ్బంది, ఇతరులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఐ.బి. వద్ద వాక్‌లో పాల్గొన్న వారందరూ సహజ ప్రసవాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయడం, సురక్షితమైన, గౌరవప్రదమైన ప్రసవ విధానాలను ప్రోత్సహించడం కోసం ప్రతిజ్ఞ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>