కలం, జోగులాంబ గద్వాల: కేటిదొడ్డి మండలంలోని వెంకటాపురం గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో (Venkatapuram Temple) నూతనంగా నిర్మించిన అలువేలుమంగ నాయకి సమేత దశావతార, ధ్వజస్తంభం, నవగ్రహాల పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈఓ పురేందర్ పర్యవేక్షణలో, వేద పండితుల ఆధ్వర్యంలో దివ్యప్రబంధ పారాయణం, ప్రత్యేక పూజలు, హోమాలు, మహాపూర్ణాహుతి, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. పూర్ణాహుతి, శాంతికళ్యాణం అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. గ్రామస్తుల సహకారంతో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు
ప్రతిష్ఠాపన మహోత్సవానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కుర్వ హన్మంతు, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, సర్పంచులు శారదమ్మ, పవన్ కుమార్ రెడ్డి, నారాయణ,సింగిల్ విండో డైరెక్టర్ రఘుకుమార్ శెట్టి, ఈవో పురేందర్, నాయకులు వెంకటాపురం గోపి, తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హన్మంతు నాయుడు నాయకులు గాజులపాడు రాఘవేంద్రరెడ్డి, నాయకులు తదితరులు, హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.

