కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఉద్యమకారుల (Telangana Activists) గుర్తింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన గుర్తింపు కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో కమిటీ చైర్మన్ కే. కేశవరావు, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి, శ్యాం మోహన్ పాల్గొన్నారు.
ఉద్యమకారుల గుర్తింపు కోసం కమిటీ ఇప్పటికే వివిధ యూనివర్సిటీల విద్యార్థి నాయకులు, ఉద్యమకారులు, కళాకారులు, సబ్బండ వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, పూర్తయిన పనుల పురోగతిని సభ్యులు ఈ సమావేశంలో సమీక్షించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రధానంగా ఉద్యమకారుల (Telangana Activists) గుర్తింపు, దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న వెబ్‌సైట్ ప్రస్తుత స్థితిపై కమిటీ ఆరా తీసింది. వెబ్‌సైట్‌ను ఎప్పటిలోగా ప్రారంభించాలి, సాంకేతిక పనులను వేగవంతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వెబ్‌సైట్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని విధాలుగా కృషి చేయాలని కమిటీ అభిప్రాయపడింది. వెబ్‌సైట్ ఏర్పాటు పురోగతిని త్వరలోనే మరోసారి సమీక్షించి, దాని ప్రారంభ తేదీ, తదుపరి కార్యాచరణపై అధికారిక ప్రకటన చేస్తామని కమిటీ సభ్యులు వెల్లడించారు.
Also Read : పేదలకు ‘చేయూత’.. కొత్తగా 4.76 లక్షల మందికి భరోసా!
Follow Us On: Youtube

