కలం, వెబ్ డెస్క్: సెల్ ఫోన్ చూడొద్దని తల్లి మందలించినందుకు తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య (Suicide ) చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ లోని హయత్ నగర్ (Hayathnagar) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లమ రంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (25)కి, నల్గొండ జిల్లా టీపీగౌరారం గ్రామానికి చెందిన లక్ష్మణ్ తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవనోపాధి నిమిత్తం వీరు హైదరాబాద్ కు వలస వచ్చి హయత్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
ఇటీవల భర్త లక్ష్మణ్ తన భార్య కోసం ఈఎంఐ పద్ధతిలో కొత్త సెల్ ఫోన్ కొనిచ్చారు. అప్పటినుండి లక్ష్మీదేవి ఎక్కువ సమయం ఫోన్ చూస్తూ గడుపుతుండటంతో, ఆమె తల్లి అలివేలు ఆమెను మందలించారు. అస్తమానం ఫోన్ చూడటం మానేసి, ఏదైనా పనిచేసుకోవాలని హితవు పలికారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యింది లక్ష్మీదేవి. ఈ క్రమంలో శుక్రవారం భర్త లక్ష్మణ్ ఎప్పటిలాగే పనికి వెళ్లిన తర్వాత, లక్ష్మీదేవి ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న హయత్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

