కలం, హనుమకొండ: తెలంగాణను దేశంలోనే అగ్రగామి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) స్పష్టం చేశారు. క్రీడారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు రాణించేలా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. ఖేలో ఇండియా క్రీడల నిర్వహణతో పాటు రాష్ట్రంలో క్రీడా వసతుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.203 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.
ఖేలో ఇండియా క్రీడల నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి హనుమకొండ స్పోర్ట్స్ స్కూల్‌ను సందర్శించి నూతనంగా చేపడుతున్న నిర్మాణాలు, క్రీడాకారుల కోసం కల్పిస్తున్న మౌలిక వసతులను పరిశీలించారు. వివిధ క్రీడాంశాల్లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, శిక్షణ వివరాలను తెలుసుకున్నారు. మెన్స్ జిమ్నాస్టిక్స్‌లో సాధన చేస్తున్న క్రీడాకారుల ప్రతిభను పరిశీలించి వారిని ప్రోత్సహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి ఈ అవకాశం రావడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని 28 రాష్ట్రాల నుంచి సుమారు 7 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్న నేపథ్యంలో వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ క్రీడలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఖేలో ఇండియా కోసం చేపడుతున్న నిర్మాణాలు కేవలం పోటీల నిర్వహణకే పరిమితం కాకుండా భవిష్యత్తులోనూ రాష్ట్ర క్రీడాకారులకు ఉపయోగపడేలా శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారికి మెరుగైన శిక్షణ, ప్రోత్సాహం అందించేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినట్లు వివరించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అత్యాధునిక సౌకర్యాలతో స్టేడియం నిర్మించనున్నట్లు వెల్లడించారు.

