కలం, మెదక్ బ్యూరో : వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా, తప్పుడు నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకొని లేదా నెంబర్ ప్లేట్లను కనిపించకుండా మాస్క్డ్ నెంబర్ ప్లేట్లు చేసి రోడ్లపై తిరిగే వాహనదారులపై సంగారెడ్డి జిల్లా పోలీసులు (Sangareddy Police) కఠిన చర్యలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణంలో మెగా వెహికల్ చెకింగ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్లు వినియోగిస్తున్న 174 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. వాహనాలకు నిబంధనల ప్రకారం సరైన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు ఉండటం తప్పనిసరి అని, కొందరు వాహనదారులు ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్లు లేకుండా, నకిలీ నెంబర్లతో లేదా నెంబర్ ప్లేట్లు కనిపించకుండా మార్పులు చేసి వాహనాలు నడుపుతున్నారని, ఇలాంటి చర్యల వల్ల నేరాలకు పాల్పడిన వారిని గుర్తించడం, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాలను గుర్తించడం కష్టతరమవుతుందని ఎస్పీ పేర్కొన్నారు.
అలాగే, వాహనాలపై పెండింగ్ చలాన్లు ఉన్న వాటిని కూడా గుర్తించి, సంబంధిత వాహన యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు, పెండింగ్ చలాన్లను వెంటనే చెల్లించి క్లియర్ చేసుకోవాలని సూచించడం జరుగుతుందని తెలిపారు. నెంబర్ ప్లేట్ల విషయంలో నిబంధనలు ఉల్లంఘించే వారిని ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ హెచ్చరించారు. రానున్న రోజుల్లో జిల్లావ్యాప్తంగా ప్రత్యేక వాహన తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, స్పష్టంగా కనిపించే విధంగా సరైన నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని, పెండింగ్ చలాన్లను సకాలంలో చెల్లించాలని సూచించారు.

