లాడ్జిలో గది అడిగినందుకు దాడి.. వ్యక్తి మృతి కేసులో ఇద్దరి అరెస్ట్!

కలం, ఖమ్మం బ్యూరో: లాడ్జిలో గది కావాలని అడిగినందుకు దాడికి పాల్పడి ఓ వ్యక్తి మృతికి కారణమైన ఇద్దరు నిందితులను భద్రాచలం (Bhadrachalam) పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. భద్రాచలం డీఎస్పీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ నెల 16వ తేదీన తెల్లం శరత్ బాబును కలిసేందుకు అతని స్నేహితులు, బంధువులైన కుర్సం నాగప్రశాంత్, కీసర కార్తీక్‌లు భద్రాచలం వచ్చారు. రాత్రి బస చేసేందుకు గది కోసం వెతుకుతూ అదే రోజు రాత్రి సుమారు 10 గంటల సమయంలో రామాలయం సమీపంలోని సత్యసాయి లాడ్జికి వెళ్లారు. ​గది కేటాయింపు విషయంలో లాడ్జి యజమాని ద్వార మణికంఠ, లాడ్జి బాయ్ బర్ల వినయ్‌లు ఆ ముగ్గురితో వాగ్వాదానికి దిగి ఒక్కసారిగా దాడి చేశారు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తెల్లం శరత్ బాబు రోడ్డుపైనే స్పృహ కోల్పోయి పడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి తెల్లం రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పట్టణ పోలీసులు.. నిందితులైన ద్వార మణికంఠ, బర్ల వినయ్‌లను శుక్రవారం అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వారిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పట్టణ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>