కలం, ఖమ్మం బ్యూరో: నేరం చేసిన వారు చట్టం నుంచి ఏమాత్రం తప్పించుకోకుండా కఠిన శిక్షలు పడేలా ఖమ్మం పోలీస్ (Khammam Police) కమిషనరేట్ పటిష్ట చర్యలు చేపడుతోంది. సమర్థవంతమైన దర్యాప్తు, పక్కా సాక్ష్యాధారాల సమర్పణ, సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరచడం ద్వారా ఈ ఏడాది ఇప్పటివరకు 103 కేసుల్లో 172 మంది నేరస్తులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వీరికి జైలు శిక్షతో పాటు రూ. 13,67,150 జరిమానా కూడా పడినట్లు ఆయన తెలిపారు.
కేసుల విచారణలో ఎలాంటి జాప్యం, లోపాలు తలెత్తకుండా వేగవంతంగా విచారణ పూర్తి చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు, దర్యాప్తు అధికారుల మధ్య సమన్వయాన్ని పెంపొందించినట్లు సీపీ పేర్కొన్నారు. ముఖ్యంగా ‘కోర్టు మానిటరింగ్ సిస్టం’ ద్వారా కేసు ట్రయల్ ప్రారంభం నుంచి సాక్షుల హాజరు, తుది తీర్పు వెలువడే వరకు ప్రతి దశను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఈ ఏడాది మొత్తంగా 1,652 కేసుల్లో 3,330 మంది నిందితులకు న్యాయస్థానం రూ. 86,17,550 జరిమానా విధించిందని ఆయన వివరించారు.
ఈ ఏడాది కోర్టు విధించిన ప్రధాన శిక్షల వివరాలను పరిశీలిస్తే.. నాలుగు హత్య కేసుల్లో నలుగురికి జీవిత ఖైదుతో పాటు రూ. 11 వేల జరిమానా, మూడు అత్యాచార కేసుల్లో ఐదుగురికి జీవిత ఖైదుతో పాటు రూ. 2.87 లక్షల జరిమానా పడింది. మరో అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 3 వేల జరిమానా విధించగా, ఒక గంజాయి కేసులో ఐదుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా ఖరారైంది. ఇక రెండు హత్యాయత్నం కేసుల్లో ఒకరికి పదేళ్ల జైలు, రూ. 20 వేల జరిమానా; మరొకరికి ఐదేళ్ల జైలు, రూ. 9 వేల జరిమానా విధించారు. రెండు పోక్సో కేసుల్లో ఒక నిందితుడికి ఏడేళ్ల జైలు, రూ. 50 వేల జరిమానా; మరొకరికి ఐదేళ్ల జైలు, రూ. 50 వేల జరిమానా పడింది.
అలాగే దొంగతనాలు, మోసాలు, కట్నం వేధింపులు, గంజాయి, పోక్సో తదితర 16 కేసుల్లో 45 మందికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 6.78 లక్షల జరిమానా విధించారు. మరో ఐదు కేసుల్లో ఏడుగురికి రెండేళ్ల జైలు శిక్ష, రూ. 37 వేల జరిమానా; 15 కేసుల్లో 26 మందికి ఏడాది పాటు జైలు శిక్ష, రూ. 54 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించిందని పోలీస్ కమిషనర్ ఆ ప్రకటనలో వెల్లడించారు.

