కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఫేస్బుక్ మెటా ఆఫీస్‌పై ఇండియన్ యూత్ కాంగ్రెస్ (Indian Youth Congress) శ్రేణులు దాడికి పాల్పడ్డారు. లోపలికి చొచ్చుకెళ్లి పూలకుండీలు, కొంత ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను, యూత్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మణిశర్మ ఫేస్బుక్ ఖాతాలను మెటా సస్పెండ్ చేయడంపై భగ్గుమన్నారు.
మెటా తీరుపై దేశ వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ మెటా ఆఫీస్‌పై దాడికి పాల్పడ్డారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, కార్యకర్తలు లోపలికి వెళ్లగా.. ముందే సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. బలవంతంగా వారిని అరెస్ట్ చేసి, సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆఫీస్ బయట కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి.. మెటా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏడు రోజుల్లోగా పునరుద్ధరించకపోతే..
బీజేపీ ఒత్తిళ్లతోనే మెటా తమ నాయకుల అకౌంట్లను సస్పెండ్ చేసిందని ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆరోపించింది. ఏడు రోజుల్లోగా సస్పెండ్ చేసిన ప్రతిపక్ష నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, జర్నలిస్టుల అకౌంట్లను పునరుద్ధరించాలని అల్టిమేటం ఇచ్చింది. లేకపోతే.. దేశ వ్యాప్తంగా ఉన్న ఫేస్బుక్ కార్యాలయాలను ముట్టడించడంతో పాటు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించింది. ఇది భవిష్యత్తులో భారత్‌లో వ్యాపారాలు నిర్వహించుకోవాలంటే కష్టమైన పరిస్థితులు రావొచ్చని చెప్పింది. ఇదే చివరి వార్నింగ్ అంటూ పోస్ట్ చేసింది.

