ఐక్య ప్రజా ఉద్యమాలకు మాస్ లైన్ పిలుపు

కలం, నిజామాబాద్ బ్యూరో: CPI(ML) మాస్ లైన్ నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోటగల్లీ, డీవీకే నగర్, కే.వై. హాల్‌లో జిల్లా పార్టీ ప్లీనం (Mass Line Plenum) నిర్వహించారు. ముందుగా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ ప్లీనానికి ముఖ్య వక్తలుగా పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కామ్రేడ్స్ కేజీ రాంచందర్, కే. రమ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించుకుంటూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువత, విద్యార్థుల సమస్యలపై ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని, ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని నాయకులు సూచించారు. పార్టీ కార్యకర్తలు రాజకీయ, సైద్ధాంతిక అవగాహనను పెంపొందించుకుంటూ ప్రజా పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పార్టీ బలాన్ని పెంపొందించడంతో పాటు కార్మిక, కర్షక, ప్రజా సంఘాలను బలోపేతం చేసి ప్రజా సమస్యలపై ఐక్య పోరాటాలను నిర్మించాలని ప్లీనం నిర్ణయించింది.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఎం. నరేందర్, డివిజన్ కార్యదర్శులు ఎం. వెంకన్న, డి. రాజేశ్వర్, నగర కార్యదర్శి ఎం. సుధాకర్, జిల్లా నాయకులు గంగాధర్, మల్లేష్, కిషన్, మురళి, సీఎల్సీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి. సంఘం, ఏ. రవీందర్, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి. గోదావరి, కే. సంధ్యారాణి, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గణేష్, అనిల్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, ఏఐయూకేఎస్ జిల్లా కార్యదర్శి నారాయణ, ఒడ్డెన్న, అరుణోదయ కళాకారులు గంగారాం, రమేష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>