కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) 50 ఎకరాల భూమని తిరిగి తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసుకు వ్యతిరేకంగా వర్సిటీ విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. ‘యూనివర్సిటీ భూమి విద్యార్థులదే.. ప్రభుత్వానిది కాదు’ అంటూ నినాదాలు చేస్తూ సెంట్రల్ లైబ్రరీ నుంచి మెయిన్ గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ విద్యను, మైనారిటీ హక్కులను కాపాడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
యూనివర్సిటీలపై ఎందుకింత కక్ష : హరీశ్ రావు
తెలంగాణలో విద్యా వ్యవస్థను, విశ్వవిద్యాలయాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువులకు నిలయమైన యూనివర్సిటీల్లో రియల్ దందా చేస్తూ, భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆరోపించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీల భూములను టార్గెట్ చేయడంపై హరీశ్ రావు ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే భవనాలు కట్టడం కాదు, భావితరాలకు జ్ఞానాన్ని అందించే పరిశోధనా కేంద్రాలను కాపాడుకోవడం అని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
‘జయశంకర్, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి బలవంతంగా 100 ఎకరాలకు పైగా భూములను లాక్కున్నారు. 60 ఏళ్లుగా ఎంతో కష్టపడి కాపాడుకుంటూ వస్తున్న ఔషధ, సుగంధ మొక్కల పరిశోధనా కేంద్రం లోని 60 ఎకరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఎంతో విలువైన పరిశోధనా సంపద నేలమట్టమైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలకు పైగా అటవీ భూమిని తాకట్టుపెట్టి విధ్వంసం చేశారు. దీనివల్ల అక్కడి పర్యావరణ వ్యవస్థ చిన్నాభిన్నం కావడమే కాకుండా, మూగ జీవాల మనుగడకే ముప్పు వాటిల్లింది. ఇప్పుడు తాజాగా మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి (MANUU) చెందిన 50 ఎకరాలపై ప్రభుత్వం కన్ను పడింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విద్యార్థులన్నా, పరిశోధనలన్నా, పర్యావరణమన్నా ఎందుకింత చిన్నచూపు. భవిష్యత్ తరాలకు జ్ఞానాన్ని అందించాల్సిన చోట, ఆవిష్కరణలకు ఊపిరి పోయాల్సిన చోట.. ఇలా భూములను లాక్కోవడం దేనికి సంకేతం? విద్యా సంస్థల భూములను కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లలా చూస్తారా?’ అని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్ రావు ప్రశ్నించారు.
Read Also: జాతీయ వేదికపై అదరగొట్టిన తెలంగాణ షూటర్లు
Follow Us On: Youtube


