నీటి సంరక్షణ ప్రతి ఒకరి బాధ్యత: AISF

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్‌లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య(AISF) ఆధ్వర్యంలో నీటి సంరక్షణ, భవిష్యత్తులో ఎదురయ్యే నీటి కొరతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుని వర్షపాతం తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే పరిస్థితులు, సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఇలాంటి పరిస్థితుల్లో నీటి కొరతను అధిగమించాలంటే ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కట్టుబడి బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నీరు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వనరు అని, నీరు లేనిదే మానవ మనుగడతో పాటు వ్యవసాయం, పర్యావరణ సమతుల్యత సాధ్యం కాదని అన్నారు. విద్యార్థి దశ నుంచే నీటి విలువను గుర్తించి నీటిని వృథా చేయకుండా ఉపయోగించుకోవాలని సూచించారు.

వసతి గృహంలో కూడా కుళాయిలను అవసరం లేనప్పుడు తెరిచి ఉంచకూడదని, ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టే పద్ధతులను ప్రోత్సహించాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి నీటి సంరక్షణను తన బాధ్యతగా భావించి కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి కూడా అవగాహన కల్పించాలని కోరారు. నీటిని ఆదా చేయడం అంటే భవిష్యత్తు తరాలకు జీవనాధారాన్ని అందించడమేనని పేర్కొన్నారు.

అనంతరం విద్యార్థులందరితో నీటిని వృథా చేయకుండా సంరక్షిస్తామని, ప్రతి నీటి బొట్టును విలువైనదిగా భావిస్తామని, ఇతరులకు కూడా నీటి పొదుపుపై అవగాహన కల్పిస్తామని జల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ స్వప్న రాణి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, నాయకులు అశోక్, వినీత్, నాని, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>