ఎల్ నినో ముప్పుపై ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలి: ఎంపీ చామల

కలం, నకిరేకల్ : రానున్న ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు, రైతులు ఇప్పటి నుంచే అప్రమత్తమై ప్రతి నీటి బొట్టును సంరక్షించుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలోని జీబీఎం ఫంక్షన్ హాల్‌లో ఎల్ నినోపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన ఎంపీ, ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గురువారం నూతనంగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.

గత ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని, ప్రస్తుత ప్రభుత్వం దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తూ ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తోందని అన్నారు. ఎల్ నినో దృష్ట్యా రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని, ఉపాధి హామీ (విబిజి రాంజీ) పథకం కింద ఇంకుడు గుంతలు, వాననీటి సంరక్షణ పనులు పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నీరు అత్యంత విలువైనదని, రబీలో వరి సాగును తగ్గించి స్వల్పకాలంలో చేతికి వచ్చే ఆరుతడి పంటలు వేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి సహకరించాలని రైతులను కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం చేయూత పెన్షన్లలో భాగంగా శాలిగౌరారం మండలానికి కొత్తగా 1,016 పింఛన్లను మంజూరు చేసిందని, ఈ నెల 26 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని ఆయన వెల్లడించారు. అలాగే, కొత్తగా ప్రారంభించిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం కింద కుటుంబంలో ఆర్జించే వ్యక్తి మరణిస్తే రూ.5 లక్షల బీమా అందుతుందని తెలిపారు. రేషన్ కార్డు, ఆధార్, మొబైల్ నంబర్ ఉన్న జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ.. కరువు పరిస్థితులను తట్టుకునేందుకు రైతులు తమ పొలాల్లో ఫామ్ పాండ్స్ (పంట కుంటలు), ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కోరారు. ప్రజా ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, నెలకు రూ.2,016 చేయూత పెన్షన్లు, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ అండగా నిలుస్తోందని వివరించారు. అనంతరం ఎంపీ, కలెక్టర్, ఎమ్మెల్యేలు కలిసి లబ్ధిదారులకు చేయూత పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమం చివరలో హాజరైన వారందరి చేత నీటిని వృధా చేయబోమని అధికారులు నీటి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సదస్సులో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఇతర జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>