కలం, వెబ్ డెస్క్ : ప్రతిపక్ష వైసీపీపై జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు (Konidela Nagababu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయిందని, అది కేవలం ఇంకా బతికే ఉన్నామనే భ్రమలో తిరుగుతున్న ఒక ‘చనిపోయిన పార్టీ’ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో సాధించిన విజయాలే ప్రజల నాడికి నిదర్శనమని పేర్కొన్నారు. కోట్లాది మంది సామాన్య ప్రజలు కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి వైపు నిలబడ్డారని, వైసీపీ వెంట కేవలం పది ఇరవై మంది రౌడీ శక్తులు మాత్రమే మిగిలారని ఎద్దేవా చేశారు.
మరో 15 ఏళ్లు కూటమి పాలనే!
రాబోయే మరో పదిహేనేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతుందని నాగబాబు (Nagababu) ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా వైసీపీ నేతల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తుండటంతో, ప్రతిపక్షానికి అసలు పోటీ ఇచ్చే స్థాయి కూడా లేకుండా పోయిందని స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయిలో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు సమన్వయంతో పనిచేయడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు సాధ్యమయ్యాయని నాగబాబు పేర్కొన్నారు. కూటమి పాలనలో పారదర్శకత వల్లే ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతుందని వెల్లడించారు. వైసీపీ నేతలు ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకుని వాస్తవాలను గ్రహించాలని హితవు పలికారు. లేదంటే ఆ పార్టీ రాజకీయంగా పూర్తిగా కనుమరుగవ్వడం ఖాయమని హెచ్చరించారు.
Also Read : అజిత్ దోవల్‌కు సమన్లు.. భారత్ షాకింగ్ రిప్లై!
Follow Us On : WhatsApp

