కలం, నిజామాబాద్ బ్యూరో: బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రి సీతక్క (Minister Seethakka) తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. “కాళ్లు మొక్కించుకునే వాళ్లం కాదు.. కాళ్లు మొక్కించుకునే వాళ్లను తరిమికొట్టే వాళ్లం” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రశాంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన బాల్కొండలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళల జోలికి వస్తే ఆడబిడ్డలంతా కేసీఆర్‌పై మట్టి పోసినట్లుగా నిరసన వ్యక్తం చేస్తారని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ మండలం నల్లూర్ గ్రామంలో(Nallur Village) నిర్వహించిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు.
మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) అంటూ ప్రశ్నించారు. తాను ఏం తప్పు చేశానని, ఒక గిరిజన మహిళను ఉద్దేశించి సిగ్గు లేదా అంటూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అవమానకరంగా మాట్లాడారని మండిపడ్డారు. జిల్లాకు ఇన్‌చార్జిగా వచ్చినందుకు తప్పా? మహిళలకు, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుంటే మహిళా మంత్రిగా తాను ఉండటం తప్పా? అని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న నువ్వు మంత్రిగా ఏం చేశావని నిలదీశారు.
ఇదేనా ప్రశాంత్ రెడ్డి సంస్కారం? కేసీఆర్ ఇదే సంస్కారం నేర్పుతున్నారా? అని సీతక్క (Minister Seethakka) ప్రశ్నించారు. కాళ్లు మొక్కించుకునే వాళ్లం కాదని, కాళ్లు మొక్కించుకున్న గడీల వాళ్లను తరిమికొట్టే సంస్కృతి తమదని ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను గిరిజన మహిళగా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ తనను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. మహిళల జోలికి వస్తే కేసీఆర్‌పై కూడా ఆడబిడ్డలు అదే విధంగా నిరసన వ్యక్తం చేస్తారని సీతక్క విమర్శించారు.
Also Read : అసెంబ్లీ పెట్టు రేవంత్.. ఆధారాలతో సహా రుజువు చేస్తా: హరీశ్ రావు
Follow Us On: X(Twitter)

