కలం, పెద్దపల్లి : పెద్దపల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ బీమా పథకం ఆన్లైన్ విధానాన్ని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు (MLA Vijayaramana Rao) ప్రారంభించారు. సుల్తానాబాద్ (Sultanabad) మున్సిపల్ పరిధిలోని పదో వార్డులో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత ఆధ్వర్యంలో, పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి బస్తీ దవాఖాన వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక నేతలతో కలిసి బీమా పోస్టర్లను ఆవిష్కరించి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం సుల్తానాబాద్ పట్టణంలోని పదో వార్డులో లబ్ధిదారుల ఆహ్వానం మేరకు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రభుత్వ విప్ విజయరమణ రావు ప్రారంభించారు. తదుపరి సుల్తానాబాద్ ప్రభుత్వ కళాశాల మైదానంలో కోకో క్రీడా పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ బీమా పథకం వర్తిస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుచూపుతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని బుధవారం సిద్దిపేటలో ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని, కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే బీమా వర్తిస్తుందని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఎలాంటి షరతులు లేకుండా ఈ పథకాన్ని ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తోందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వం ఇచ్చి అమలు చేయని హామీలను సైతం నేడు ప్రజల కళ్లముందు అమలు చేసి చూపిస్తోందని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైందని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రేషన్ కార్డుల విషయంలో ప్రజలకు మొండిచేయి చూపించిందని విమర్శించారు. మరో నాలుగైదు రోజుల్లో సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రూ.8.30 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు వెల్లడించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్లు బిరుదు రాధాకృష్ణ, నూగిల్ల మల్లయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్లు టి. రమేష్, వెంకటేష్, పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పలువురు పాల్గొన్నారు.

