కలం, నిర్మల్ : ఉపాధి కోసం ఒమన్ వెళ్లి అక్కడి కార్మిక శాఖ అధికారుల చేతిలో అరెస్టై జైలులో చిక్కుకున్న నిర్మల్ జిల్లా వాసి గుమ్ముల సాయన్న ఎట్టకేలకు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామానికి చెందిన గుమ్ముల ముత్తన్న కుమారుడు సాయన్న ఒమన్లోని రువీ జైలులో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని (Nirmal MLA) కలిసి తమ సమస్యను విన్నవించారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సాయన్నను స్వదేశానికి రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగం అక్టోబర్ 31న అధికారిక వైర్లెస్ సందేశం జారీ చేసి, భారత రాయబార కార్యాలయం, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా అవసరమైన చర్యలు చేపట్టింది. ఈ ప్రయత్నాలు ఫలించడంతో సాయన్న నేడు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. తమ కుటుంబ సభ్యుడు క్షేమంగా తిరిగి రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి సాయన్న కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

