మోదీ విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్ : సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీ పాలనపై విమర్శలు

మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ ప్రతి పేదవాడి అభివృద్ధిని కోరుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ వంటి దర్యాప్తు సంస్థలను రాజకీయ ఆయుధాలుగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 12 ఏళ్లలో మోదీ సృష్టించిన భయాన్ని యువత కేవలం 12 రోజుల్లోనే పోగొట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో జాతి, మతం, భాష పేరుతో విభేదాలు సృష్టిస్తూ, పేదల ఓటు హక్కును తొలగించే ప్రయత్నం జరుగుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

మోదీ 120 లక్షల కోట్ల అప్పు చేశారు..

మోదీ (PM Modi) ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారో లెక్కే లేదని, ఆయన విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా మారారని సీఎం ఎద్దేవా చేశారు. మోదీకి ముందున్న ప్రధానులు అందరూ కలిసి 53 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే, మోదీ ఒక్కరే 12 ఏళ్లలో 120 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిధులను అదానీ జేబులో వేస్తున్నారని, కానీ తాను మాత్రం అదానీ వద్ద నుంచి నిధులు తీసుకువచ్చి తెలంగాణలో అభివృద్ధి చేస్తూ యువతకు ఉపాధి కల్పిస్తున్నానని తెలిపారు. ఎవరికీ చెప్పకుండా పాకిస్థాన్ వెళ్లి బిర్యానీ తిని వచ్చిన మోదీని, తాను ఖేలో ఇండియా, గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానం కోసం కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు.

కేసీఆర్ తోనే పోటీ..

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ను మాత్రమే తాను పోటీ నేతగా భావిస్తానని, కేటీఆర్ పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడనని రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటా నాయకుడని, తండ్రిని అడ్డం పెట్టుకుని పైకి వచ్చారని విమర్శించారు. తాను ఏబీవీపీ నుంచి వచ్చి, 17 ఏళ్ల స్వయం శక్తితో ముఖ్యమంత్రిని అయ్యానని గుర్తు చేశారు. నా కథలో కేసీఆర్ (KCR) రావణాసురుడని, ప్రతిపక్షం ఉండాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీని వదిలేశామని, లేకుంటే ఎప్పుడో ఖాళీ చేసేవాళ్లమని అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రారంభించిన కేసీఆర్‌ను ఇప్పుడు అదే అంశం చుట్టుకుందని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో బీజేపీ ఉనికి లేదు

తెలంగాణలో బీజేపీకి అసలు స్థానమే లేదని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదని సీఎం ఎద్దేవా చేశారు. అమిత్ షాకు ధైర్యం ఉంటే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి అసదుద్దీన్ ఓవైసీని ఓడించాలని సవాల్ విసిరారు.

స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్

దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, ప్రజలు ఉన్నన్ని రోజులు, మరో వెయ్యి ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు పునాదులు వేస్తే, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించారని కొనియాడారు. రాష్ట్రంలో మూడేళ్లలో 65 శాతం హామీలను అమలు చేశామని, వచ్చే రెండేళ్లలో మిగిలినవి పూర్తి చేస్తామని చెప్పారు.

తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ ద్వారా దేశ జీడీపీలో రాష్ట్ర వాటాను 10 శాతానికి పెంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనలో యాభై శాతం సీట్లు పెంచితే దక్షిణ భారతదేశంతో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడతాయని, ఇది దేశానికి ఇబ్బందికరమని పేర్కొన్నారు.

Also Read : రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది : హరీశ్ రావు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>