పుష్పాలతో పులకించిన యాదాద్రి.. వైభవంగా కోటి పుష్పార్చన!

కలం, యాదగిరిగుట్ట: పుష్పాల పరిమళం, వేదమంత్రాల గంభీర నాదం, మేళ తాళాల మంగళ ధ్వనులు, భక్తుల గోవింద నామస్మరణలతో యాదాద్రి(Yadadri) క్షేత్రం ఆధ్యాత్మిక వైభవంతో పులకించిపోయింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో శుక్రవారం నిర్వహించిన సహస్రనామావళి సహిత కోటి పుష్పార్చన భక్తులకు కనుల పండువగా నిలిచింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

తెల్లవారుజామునే ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు, వేద పండితులు అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, ఆరాధనలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన స్వామివారికి మేళతాళాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ వైభవోత్సవ ఊరేగింపు నిర్వహించారు. మాడవీధుల మీదుగా సాగిన స్వామివారి ఊరేగింపు భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోటి పుష్పార్చన మండపానికి స్వామివారు చేరుకున్న అనంతరం సహస్రనామావళి పారాయణంతో పుష్పార్చన కార్యక్రమం వైభవంగా కొనసాగింది.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి పాట్నా హైకోర్టు న్యాయమూర్తి గౌరవనీయులు జస్టిస్ అభిషేక్ రెడ్డి హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆయనకు ఘన స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. కోటి పుష్పార్చనలో ఆయన పాల్గొనడం కార్యక్రమానికి మరింత విశిష్టతను తీసుకొచ్చింది. అదేవిధంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సైతం కోటి పుష్పార్చన కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.

వేద పండితులు, వేద విద్యార్థులు, దేవస్థానం సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు, మహిళలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పుష్పార్చనలో భాగస్వాములయ్యారు. భక్తులు, ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>