కలం, సినిమా: యువ సామ్రాట్ నాగ చైతన్య ‘వృషకర్మ’ (Vrushakarma) సినిమాతో ప్రేక్షకులను మైథాలజీ, మిస్టరీతో కూడిన ఆసక్తికరమైన ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక థ్రిల్లర్ పురాతన రహస్యాలు, దాగి ఉన్న నిజాలు, ఉత్కంఠభరితమైన అంశాల చుట్టూ సాగుతుంది. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను బాపినీడు సమర్పిస్తున్నారు. రిచ్ విజువల్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ప్రేక్షకులకు బిగ్ స్క్రీన్‌పై కొత్త అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ఫస్ట్ సింగిల్ ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’తో గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ పాటలో హీరో స్టైల్, ఆటిట్యూడ్, ఎనర్జిటిక్ పర్సనాలిటీని చూపించడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విడుదలైన రెండో పాట ‘ఛలో పదవే’ సినిమాలోని మరో ఎమోషనల్ కోణాన్ని పరిచయం చేస్తోంది. మొదటి పాటలోని ఎనర్జీకి భిన్నంగా, ఈసారి మనసును హత్తుకునే మెలోడీతో కథలోని సున్నితమైన భావోద్వేగాలను చూపించారు.
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘ఛలో పదవే’ పాట అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందన్నారు. ఈ పాటకు అజ్నీస్ మ్యూజిక్, అనంత శ్రీరామ్ లిరిక్స్ చాలా బాగా కుదిరాయన్నారు. ఇందులో తాను అర్జున్ అనే పాత్రలో నటించినట్లు చెప్పారు. సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఫ్రెష్‌గా ఉంటుందని అన్నారు. డైరెక్టర్ కార్తీక్ ప్రతి క్యారెక్టర్‌ను ఒక కొత్తగా ప్రజెంట్ చేశారన్నారు. తెలుగు ఆడియన్స్‌కు చాలా కొత్త అనుభూతి ఇస్తుందని తెలిపారు.

