దివ్యాంగుల క్రికెట్‌కు బీసీసీఐ అండ

క‌లం, స్పోర్ట్స్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరోసారి తన పెద్ద మనసును చాటుకుంది. 2026 హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నీ ద్వారా వచ్చిన తమ ఫీజును దివ్యాంగుల క్రికెట్ (Disability Cricket) అభివృద్ధికి విరాళంగా ఇవ్వాలని తాజాగా నిర్ణయించింది. 1992లో ప్రారంభమైన ఈ ఐసీసీ గుర్తింపు పొందిన టోర్నీని హాంకాంగ్ ప్రభుత్వ సహకారంతో క్రికెట్ హాంకాంగ్, చైనా (CHKC) నిర్వహిస్తోంది. 2026 ఎడిషన్ అక్టోబర్ 30 నుండి నవంబర్ 1 వరకు జరిగింది. ఇందులో 8 పూర్తిస్థాయి సభ్య దేశాలు, 4 అసోసియేట్ దేశాలతో కలిపి మొత్తం 12 అంతర్జాతీయ జట్లు తలపడ్డాయి. ఈ టోర్నీలో మహిళల ప్రదర్శన మ్యాచ్ కూడా నిర్వహించారు.

ఈ టోర్నీ ద్వారా తమకు దక్కిన ఫీజును మూడు స్వచ్ఛంద సంస్థలకు అందించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. వీల్‌చైర్ క్రికెట్ ఇండియా అసోసియేషన్, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా, ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్‌లకు ఈ నిధులు వెళ్తాయి. దివ్యాంగులలో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ఈ విరాళం ఉపయోగపడనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ బోర్డుగా తమ బాధ్యత కేవలం దేశ సరిహద్దులకే పరిమితం కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు.

అసోసియేట్ దేశాల్లో ఆటను విస్తరించడంతో పాటు, అందరినీ కలుపుకొనిపోయేలా క్రీడను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై క్రికెట్ హాంకాంగ్, చైనా (సీహెచ్‌కేసీ) గురువారం కృతజ్ఞతలు తెలిపింది. అసోసియేట్ దేశాల క్రికెట్ అభివృద్ధికి అండగా నిలుస్తున్న ఐసీసీ ఛైర్మన్ జై షా, బీసీసీఐకి సీహెచ్‌కేసీ బోర్డు డైరెక్టర్ అనురాగ్ భట్నాగర్ ధన్యవాదాలు చెప్పారు. ఇలాంటి టోర్నీలకు మద్దతు ఇవ్వడం వల్ల చిన్న క్రికెట్ దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు లభిస్తాయని సీహెచ్‌కేసీ అభిప్రాయపడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>