కలం, కరీంనగర్ : కొండగట్టు శ్రీ అంజనేయస్వామి ఆలయంలో నిర్వహించనున్న చందనోత్సవాల (Chandanotsavam) సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 29 వరకు ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
చందనోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలను ఎస్పీ సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీసుల విధుల కేటాయింపు, క్యూలైన్ల నిర్వహణ, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.
ఆలయ పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగించాలని, రద్దీ ప్రాంతాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపేలా చర్యలు చేపట్టి, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలన్నారు.
బందోబస్తు సిబ్బంది భక్తులతో మర్యాదగా వ్యవహరిస్తూ అవసరమైన సహాయాన్ని అందించాలని, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా సిద్ధంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఈ పరిశీలనలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, మల్యాల సీఐ రాజ్ కుమార్, ఎస్సైలు సందీప్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

