అశ్వాపురం ఆలయాల్లో చోరీ కేసు గుట్టురట్టు – ముగ్గురు దొంగలు అరెస్ట్!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం (Aswapuram) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓం శక్తి, సాయిబాబా ఆలయాల్లో జరిగిన భారీ చోరీ (Temple Theft) కేసును పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు పాత నేరస్థులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు రూ. 7.54 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం డీఎస్పీ (మణుగూరు ఇన్‌చార్జ్ డీఎస్పీ) అరుణ్ కుమార్ తెలిపారు. గురువారం మణుగూరులోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.

​ఈ నెల 12, 13 తేదీల మధ్య అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు అశ్వాపురంలోని ఓం శక్తి, సాయిబాబా ఆలయాల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి మెడలోని 105 గ్రాముల బరువుగల మూడు బంగారు పుస్తెల తాళ్లతో పాటు వెండి కిరీటాలు, చేతులు, పాదాలు, శఠగోపం తదితర 7 కిలోల 900 గ్రాముల వెండి వస్తువులను అపహరించారు. చోరీకి గురైన ఆభరణాల విలువ సుమారు రూ. 7,54,000 ఉంటుందని ఆలయ సూపర్‌వైజర్ రామకృష్ణన్ సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశ్వాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

​జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో సీసీఎస్ బృందం, అశ్వాపురం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం ఉదయం గొల్లగూడెం శివారులోని సీతారామ కెనాల్ బ్రిడ్జి వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తామే అశ్వాపురం ఆలయాల్లో చోరీ చేసినట్లు వారు అంగీకరించడంతో, వారి వద్ద నుంచి చోరీ సొత్తును పూర్తిస్థాయిలో రికవరీ చేసి అరెస్ట్ చేశారు.

​అరెస్టయిన నిందితులను పాల్వంచ నవభారత్‌కు చెందిన షేక్ జానీ అలియాస్ జానీ షరీఫ్ (స్వస్థలం: రెడ్డిపాలెం, బూర్గంపహాడ్ మండలం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం గ్రామానికి చెందిన సప్కా కాంతారావు, నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ఊర లింగయ్యగా గుర్తించారు. నిందితుల గత నేర చరిత్రను పరిశీలించగా.. షేక్ జానీపై 11, సప్కా కాంతారావుపై 14, ఊర లింగయ్యపై 8 చోరీ కేసులు ఉన్నట్లు వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. నిందితులను రిమాండ్ నిమిత్తం న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను పట్టుకోవడంతో పాటు చోరీ సొత్తును రికవరీ చేసిన అశ్వాపురం పోలీస్ సిబ్బందిని, సీసీఎస్ బృందాన్ని డీఎస్పీ అరుణ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>