కలం, వెబ్ డెస్క్: నల్లగొండ (Nalgonda) పట్టణంలో ఓ మున్సిపల్ పారిశుధ్య కార్మికురాలి (Sanitation Worker) పై ఇంటి యజమాని కర్రతో దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పట్టణంలోని 45వ వార్డు ప్రకాశం బజార్ ప్రాంతంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికురాలు జానమ్మ రోజువారీ విధుల్లో భాగంగా చెత్త సేకరణ పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ ఇంటి యజమానికి, జానమ్మకు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు సమాచారం. మాటా మాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన సదరు యజమాని, జానమ్మపై కర్రతో దాడి చేశాడు. మహిళా కార్మికురాలు అని కూడా చూడకుండా కర్రతో దాడి చేయడంపై తోటి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తనపై దాడి చేసిన ఇంటి యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు జానమ్మ నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు మహిళా కార్మికురాలే మొదట తమతో దురుసుగా ప్రవర్తించి, అసభ్యకరమైన పదజాలంతో దూషించిందని దాడి చేసిన యజమాని తల్లితోపాటు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇరువర్గాల ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో ఏం జరిగింది? అసలు గొడవకు కారణమేంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

