కలం, ముధోల్ : నిర్మల్ జిల్లాలోనే అత్యధికంగా ముధోల్ నియోజకవర్గానికి 5 వేల చేయూత పింఛన్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Mudhole MLA) తెలిపారు. మంగళవారం ముధోల్ మండల కేంద్రంలోని లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పదేళ్లలో పింఛన్లు అందక పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రభుత్వం, అధికారుల సహకారంతో నియోజకవర్గంలో 5 వేల మందికి పింఛన్లు మంజూరు చేయించినట్లు తెలిపారు.
వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు పింఛన్లు అందించడం స్వాగతించదగ్గ విషయమని, అదేవిధంగా వృద్ధులకు కూడా ఎన్నికల హామీ మేరకు రూ. 4 వేల పింఛన్ అందించాలని కోరారు. వికలాంగులకు రూ. 6 వేల పింఛన్ ఇవ్వాలని, ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. ముధోల్ మండల అభివృద్ధికి రూ.5 కోట్లతో సీసీ రోడ్లు, రూ.4 కోట్లతో కస్తూరిబా పాఠశాల భవనం, రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. ప్రతి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాల్సి ఉండగా, ఈసారి 1,000 మాత్రమే కేటాయించారని, త్వరలో కొత్త లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

