హెచ్‌ఐవీ నియంత్రణ.. సురక్షిత్ జిల్లాగా కరీంనగర్‌

క‌లం, క‌రీంన‌గ‌ర్‌: హెచ్‌ఐవీ (HIV) నియంత్రణలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) నిర్దేశించిన 95-95-95 లక్ష్యాల సాధనలో మెరుగైన ప్రగతి కనబరిచి కరీంనగర్ జిల్లా ‘సురక్షిత్‌’ (Surakshit) హోదాను దక్కించుకుంది. నాకో ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సమ్మాన్ సమారోహ్‌’లో రాష్ట్రంలోని సురక్షిత్ కేటగిరీలో ఎంపికైన 20 జిల్లాల్లో కరీంనగర్ కూడా చోటు సంపాదించింది. ఈ సందర్భంగా నాకో రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం మంగళవారం ఐడీఓసీలోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల అధికారులతో కలిసి జిల్లాలో సాధించిన ప్రగతిని వివరించారు.

మూడు లక్ష్యాలే ప్రామాణికం

హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిలో 95 శాతం మందికి తమ వ్యాధి స్థితిపై అవగాహన కల్పించడం, వారిలో వ్యాధి నిర్ధారణ అయిన 95 శాతం మందికి యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ) చికిత్స అందించడం, చికిత్స పొందుతున్న వారిలో 95 శాతం మందికి వైరల్ సప్రెషన్ సాధించడం ఈ కార్యక్రమంలోని ప్రధాన లక్ష్యాలు. ఈ మూడు ప్రమాణాల ఆధారంగా జిల్లాల పనితీరును అంచనా వేసి సురక్షిత్, సక్షమ్, సంఘర్ష్‌శీల్ కేటగిరీలుగా విభజిస్తున్నారు.

సమన్వయంతోనే మెరుగైన ఫలితాలు

జిల్లాలో హెచ్‌ఐవీ పరీక్షలను విస్తృతం చేయడం, బాధితులను ముందుగానే గుర్తించడం, చికిత్సకు అనుసంధానం చేయడం, ఏఆర్‌టీ సేవలు అందించడం, నిరంతర పర్యవేక్షణ, వైరల్ లోడ్ పరీక్షలు నిర్వహించడం వంటి చర్యలు మెరుగైన ఫలితాలకు దోహదపడ్డాయని అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ నియంత్రణ విభాగం అధికారులు, ఐసీటీసీ, ఏఆర్‌టీ కేంద్రాల సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని పేర్కొన్నారు.

సాధించిన ప్రగతిని కొనసాగించాలి

జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల అమలు, ఇప్పటివరకు సాధించిన పురోగతి, సురక్షిత్ హోదాకు దోహదపడిన చర్యలపై కలెక్టర్‌కు రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ సాధించిన ప్రగతిని కొనసాగిస్తూ హెచ్‌ఐవీ నివారణ, పరీక్షలు, చికిత్స, బాధితులకు నిరంతర వైద్య సేవలు అందించే ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
నాకో తాజా జాతీయ స్కోర్‌కార్డులో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో స్థానాన్ని సాధించినట్లు సమ్మాన్ సమారోహ్‌ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు సురక్షిత్ స్థాయికి చేరుకునేలా కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సుధా, డీపీఎం సురేందర్ రెడ్డి, డీఐఎస్ శ్రీనివాస్, డీఎంవో సుమన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>