ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ సర్కారు విఫలం: రాంకిషన్‌ రెడ్డి

కలం, నిర్మల్ : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్‌ నిర్మల్ (Nirmal) నియోజకవర్గ ఇన్చార్జి రాం కిషన్‌ రెడ్డి విమర్శించారు. మంగళవారం నిర్మల్‌ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అభయ హస్తం మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారంటీలు, వివిధ డిక్లరేషన్ల హామీలు మూడేళ్లు గడుస్తున్నా సంపూర్ణంగా అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, కౌలు రైతులకు సాయం, రూ.2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామీలపై ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు.

రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, ఉద్యోగులకు పీఆర్సీ, పాత పెన్షన్ విధానం వంటి హామీలు కూడా నెరవేరలేదని పేర్కొన్నారు. నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాలకు పరిశ్రమల కారిడార్, ప్రాణహిత,చేవెళ్ల ప్రాజెక్టు, ఆదిలాబాద్‌లో యూనివర్సిటీ ఏర్పాటు వంటి హామీలపై పురోగతి లేదని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశకు గురిచేస్తోందని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల పార్టీ కన్వీనర్లు కృష్ణారెడ్డి, మహేష్ రెడ్డి, నాయకులు అయ్యన్నగారి రాజేందర్, నజీరుద్దిన్, అయూబ్, రిజ్వాన్, నయీమ్, అక్రమ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>