కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad) క్యాంపస్‌లో జర్మనీకి (Germany) చెందిన ఇంటర్నేషనల్ లంగ్ రీసెర్చ్ సెంటర్ (Lung Research Center), ఐఐటీ హైదరాబాద్ బయో మెడికల్ ఇంజినీరింగ్ (Biomedical Engineering) విభాగం సంయుక్తంగా లంగ్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జర్మనీ ఇనిస్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్ సెంటర్ ప్రొఫెసర్ వెర్నర్ సీగర్, పద్మవిభూషణ్, AIG హాస్పిటల్ అధినేత నాగేశ్వర్ రెడ్డి, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి పాల్గొన్నారు.
గాలి కాలుష్యం, ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం, ధూమపానం, ఆహారపు అలవాట్ల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని పద్మవిభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. దీనిపై అధ్యయనం చేయడానికి ఐఐటీ హైదరాబాద్‌లో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఈ తరహా పరిశోధనల కోసం రీసెర్చ్ సెంటర్ లేదని, డాక్టర్స్ , బయో మెడికల్ ఇంజనీర్స్ కలిసి పరిశోధనలు చేస్తారని తెలిపారు. కొత్త ఊపిరితిత్తుల కణాలు తయారుచేసేందుకు, వ్యాధులను నివారించేందుకు ఈ సెంటర్ దోహదపడుతుందని పేర్కొన్నారు. దేశంలో హార్ట్ ఎటాక్‌ల కంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer) ప్రమాదకరంగా మారిందని, కరోనా తర్వాత ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువయ్యాయని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు.

Read Also: ఐఐటీ హైదరాబాద్ ఆవిష్కరణ.. ఇక ట్రాఫిక్ జామ్‌కు బైబై..!
Follow Us On: Youtube


