కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఓ వైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఖమ్మం జిల్లాలో పర్యటిస్తుంటే మరోవైపు ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కార్పొరేటర్లు బుధవారం ప్రత్యేకబస్సులో హైదరాబాద్ చేరుకున్నారు. తొలుత గాంధీభవన్లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కార్పొరేటర్లకు కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో కార్పొరేటర్లు దనియాల రాధ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి, సీహెచ్ లక్ష్మీ, జీ చంద్రకళ, డీ సరస్వతి, అమృతమ్మ, శ్రావణి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎమ్మెల్యే మట్టా రాగమయి, తుమ్మల యుగంధర్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంలో కేటీఆర్ హడావుడి
ఓ వైపు తన పార్టీకి ఖమ్మం జిల్లా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరగా అదే జిల్లాలో కేటీఆర్ హడావుడి చేశారు. ఖమ్మంలో ఆయన ఇటీవల గెలుపొందిన బీఆర్ఎస్ మద్దతుదారులైన సర్పంచ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా మంత్రులు 30 పర్సెంట్ కమీషన్ల కోసం పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహంతో పనిచేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

Read Also: కేటీఆర్ మరోసారి వరంగల్ వస్తే చెప్పులతో కొట్టిస్తా
Follow Us On: Youtube


