కలం వెబ్ డెస్క్ : అమరావతి(Amaravati)లో రెండో విడత భూసేకరణ(Land Acquisition) ప్రారంభించిన మంత్రి నారాయణ(Minister Narayana)కు చేదు అనుభవం ఎదురైంది. వడ్డమాను(Vaddamanu) గ్రామంలో భూసేకరణ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రిపై రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో గ్రామంలో నిర్వహించిన సభ రసాభాసగా మారింది. అమరావతి చట్టబద్ధత గురించి రైతులు మంత్రి నారాయణను ప్రశ్నించారు. మొదటి విడతలో భూసేకరణ చేసి ఎంత వరకు అభివృద్ధి చేశారని అడిగారు. మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు పూర్తి పరిహారం చెల్లించారా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రాజధానిలో ఏయే అభివృద్ధి పనులు చేపట్టారని, ఎన్ని పూర్తి చేశారని నిలదీశారు. మంత్రి ఇచ్చిన సమాధానంతో రైతులు సంతృప్తి చెందలేదు. మంత్రిని మరిన్ని ప్రశ్నలు అడుగుతుండటంతో పోలీసులు జోక్యం చేసుకొని రైతులను పక్కకు తీసుకెళ్లారు. అమరావతిలో రెండో విడత భూసేకరణ నేడు వడ్డమానులో ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం యండ్రాయిలో మంత్రి నారాయణ భూసేకరణ ప్రారంభిస్తారు.


