కలం, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్- 2026(Khelo India Youth Games) ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఆదిలాబాద్ జిల్లాలో విస్తృత ప్రచారం కల్పిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) సూచించారు. సోమవారం రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణీ ప్రసాద్ తదితరులు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు సంబంధించి జిల్లాల్లో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలు, ఏర్పాట్లపై మంత్రి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిసెంబర్ 11 నుంచి 22 వరకు 12 రోజుల పాటు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించాలని, ప్రజలు, విద్యార్థులు, యువతను భాగస్వాములను చేయాలని ఆదేశించారు.
ప్రతి జిల్లాలో పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రారంభోత్సవాలు చేపట్టాలని, పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి ఈ కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో ప్రతి ఏర్పాటును ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షించాలని, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఖేలో ఇండియా ప్రాధాన్యతను తెలియజేస్తూ వార్తాపత్రికల్లో ప్రత్యేక కథనాలు ప్రచురించేలా చూడాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా క్రీడా శాఖ అధికారులు దయానంద్, పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు.

