కలం, కరీంనగర్: గచ్చిబౌలి (రాయదుర్గం)లో యూనిటీ మాల్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఆరున్నర ఎకరాల లిడ్ క్యాప్ భూముల కేటాయింపును వెంటనే రద్దు చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ (Manda Krishna Madiga) డిమాండ్ చేశారు. సోమవారం ఎల్‌ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. గచ్చిబౌలిలో అత్యంత విలువైన లిడ్ క్యాప్ భూములను యూనిటీ మాల్‌కు కేటాయించడం అన్యాయమన్నారు. ఎస్సీ సామాజికవర్గ వ్యాపారులకు తగిన అవకాశాలు కల్పించని యూనిటీ మాల్‌కు, ఎస్సీల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన భూములను కేటాయించడం సమంజసం కాదని పేర్కొన్నారు. యూనిటీ మాల్‌కు కేటాయించిన ఆరున్నర ఎకరాలతోపాటు పెట్రోల్ బంక్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కోసం కేటాయించిన మరో మూడున్నర ఎకరాల భూములను కూడా వెనక్కి తీసుకోవాలని కోరారు.
లిడ్ క్యాప్ కార్పొరేషన్‌కు వేలాది ఎకరాల భూములు ఉన్నాయని, దళితులకు చెందిన భూములను ఇతర సంస్థలకు కేటాయించే విధానానికి స్వస్తి పలకాలని సూచించారు. చర్మ పరిశ్రమకు సంబంధించిన వివిధ విభాగాల్లో ఎస్సీలకు శిక్షణ ఇప్పించి, నైపుణ్యం సాధించిన వారితో పరిశ్రమలు స్థాపించేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని, లిడ్ క్యాప్ కార్పొరేషన్‌కు నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం దృష్టికి లిడ్ క్యాప్ భూముల వ్యవహారం
మంద కృష్ణ మాదిగ లేవనెత్తిన అభ్యంతరాలు, డిమాండ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఈ నెల 19న సిద్దిపేటలో జరిగే ముఖ్యమంత్రి బహిరంగ సభ సందర్భంగా మాదిగ సామాజికవర్గానికి చెందిన మంత్రి, ఎమ్మెల్యేల సమక్షంలో ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. వీలైతే భూముల వ్యవహారంపై ముఖ్యమంత్రితో కీలక ప్రకటన చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. లిడ్ క్యాప్ కార్పొరేషన్‌కు సమర్థుడైన దళితుడిని చైర్మన్‌గా నియమించాలని కూడా సీఎంని కోరనున్నట్టు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోవిందు నరేష్ మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంజం వెంకటస్వామి మాదిగ, కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగ, సీనియర్ నాయకులు బోయిని కొమురన్న, జాతీయ నాయకుడు బొర్రా బిక్షపతి మాదిగ, కనకం అంజి మాదిగ తదితరులు పాల్గొన్నారు.

