కలం, కరీంనగర్ : నగర పాలక సంస్థ (Karimnagar Corporation) పాలకవర్గం సనాతన హిందూ పండుగలు, సంప్రదాయాలకు సంబంధించిన ఏర్పాట్లపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ నాయకుడు, న్యాయవాది సోహన్ సింగ్ (Sohan Singh) ఆరోపించారు. ముఖ్యంగా కార్తీక మాసం(Karthika Masam), దీపావళి పండుగల సమయంలో వీధి దీపాలు వెలగకపోవడం, భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైనదని, ఈ మాసంలో మహిళలు తెల్లవారుజామునే నిద్రలేచి ఆలయాలకు వెళ్లి దీపాలు వెలిగించడం సంప్రదాయమని తెలిపారు. అయితే కరీంనగర్లోని 58వ డివిజన్లో (Karimnagar 58th Division) గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రోడ్లపై చీకటి అలుముకోవడంతో వీధి కుక్కల భయంతో మహిళలు ఆలయాలకు వెళ్లేందుకు జంకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నగర పాలక సంస్థ అధికారులు వెంటనే పనిచేయని వీధి దీపాలను మరమ్మతు చేయడంతోపాటు అవసరమైన చోట కొత్త స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఉదయం 6:30 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి వీధి దీపాలు వెలిగేలా సమయాలను సవరించాలని సూచించారు. వీధి కుక్కల బెడదను నివారించి ప్రజలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే గుంజ్ హైస్కూల్ ఎదురుగా ఉన్న ప్రధాన మంచినీటి పైపులైన్ లీకేజీపై గతంలో రెండుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు మరమ్మతులు చేపట్టలేదని తెలిపారు. నీటి వృథాతో పాటు స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సోహన్ సింగ్ కోరారు.
Also Read : వైభవ్.. సచిన్ అవుతాడా? కాంబ్లీ అవుతాడా?: కపిల్ దేవ్
Follow Us On: Youtube

