కలం, చండూరు (మునుగోడు) : చండూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ (Ayyappa Swamy Temple) విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమానికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి (MLA Komatireddy Raj Gopal Reddy) అయ్యప్ప మాలధారణలో, సతీమణి లక్ష్మితో కలిసి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ జరిగిన యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట తదితర వైదిక క్రతువులలో ఎమ్మెల్యే దంపతులు స్వయంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. “చండూరులో శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ ఆలయ నిర్మాణంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆలయ అభివృద్ధి కోసం రెండు రోజుల క్రితమే నా వంతుగా రూ. 20 లక్షల ఆర్థిక సహాయం అందించాను. నేడు ఈ పవిత్ర కార్యక్రమం సందర్భంగా మరో రూ. 10 లక్షల విరాళాన్ని ప్రకటిస్తున్నాను” అని తెలిపారు.
భగవంతుడు ఇచ్చిన శక్తి కొలది ప్రతి ఒక్కరూ ఇలాంటి దైవ కార్యాల్లో భాగస్వాములు కావాలి. ఈ ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించి సహకరించిన దాతలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు కొందరివాడు కాదు, అందరివాడు. దైవం విషయంలో రాజకీయాలు, కులం అనే భేదాలు ఉండవు.. మనందరం ఒకటే. ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వామి భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

