కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం (Cyber Fraud) చోటు చేసుకుంది. 78 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగినికి సైబర్ క్రైం పోలీసులమంటూ వీడియో కాల్ చేసిన కేటుగాళ్లు.. మీపై ముంబైలో మనీ లాండరింగ్ కేసు నమోదైందని భయపెట్టించారు. తాము అడిగినంత డబ్బులు పంపించకపోతే.. అరెస్ట్ అవుతారని హెచ్చరించారు. కంగారుపడిన సదరు మహిళా ఉద్యోగిని.. విడతల వారీగా వాళ్ల అకౌంట్లకు బదిలీ చేశారు. అలా ఇప్పటివరకు 1.42 కోట్లను పంపించేశారు. కొన్నాళ్లకు అనుమానం వచ్చిన బాధితురాలు, అప్పటివరకు తనతో కాంటాక్ట్ అయిన నెంబరుని సంప్రదించగా స్పందన రాలేదు. మోసపోయినట్లు గ్రహించి వెంటనే సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డిజిటల్ అరెస్ట్ ఉండదు..
సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని కాల్ చేస్తే స్పందించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్, డిజిటల్ పోలీస్ అనే వ్యవస్థలు ఉండవని, అమాయక ప్రజలను బెదిరించి దోచుకోవడానికి ఇలా చేస్తున్నారని స్పష్టం చేశారు. అనుమానాస్పద కాల్స్, సందేశాలకు స్పందించవద్దని సూచించారు. తెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పంపించవద్దని, ఆగంతకులు పంపించే లింక్స్‌ను కూడా ఓపెన్ చేయొద్దన్నారు. ఒకవేళ ఎవరిపైనా కేసులు నమోదైనా.. వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తామని, ఫోన్ల ద్వారా ఎలాంటి సంప్రదింపులు ఉండవన్నారు. బ్యాంక్ అధికారులు కూడా ఫోన్లు చేయరని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే మాత్రం వెంటనే అనుమానించాలని చెప్పారు.
Also Read : సచిన్‌తో బ్రిటన్ యువరాజు గల్లీ క్రికెట్
Follow Us On: X(Twitter)

