కలం, నిజామాబాద్ బ్యూరో: “ఆకలి ఎక్కడ ఉంటే అక్కడికి ఆహారం చేరాలి.. ఆకలితో అలమటించే వారికి అన్నం అందించాలి” అనే సంకల్పంతో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ (Induru Yuvatha NGO) ప్రారంభించిన నిరంతర అన్నదాన సేవకు 2,000 రోజులు పూర్తయ్యాయి. ఆకలితో ఉన్నవారి వద్దకే అన్నదాన వాహనం చేరుకుని వారి ఆకలి తీరుస్తోంది. నగరంలోని రహదారులు, వీధులు, బహిరంగ ప్రదేశాల్లో ఆశ్రయం లేకుండా జీవిస్తున్న అనాథలు, నిరుపేదలు, అభాగ్యులు ఎక్కడ కనిపించినా సంస్థ బృందం భోజనం అందించి కడుపు నింపుతోంది.
ప్రతిరోజూ ఒక నిర్దిష్ట ప్రాంతానికే పరిమితం కాకుండా, ఆహారం అవసరమైన వారు ఎక్కడ ఉన్నారో గుర్తిస్తూ సేవా బృందం ముందుకు సాగుతోంది. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయాణంలో ఇప్పటికే కొన్ని వేల మంది ఆకలిని తీర్చగలిగింది. కేవలం ఒక రోజు, ఒక సందర్భం లేదా ఒక వేడుకకు పరిమితం కాకుండా… రోజులు, నెలలు, సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా విరామం లేకుండా ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించడంపై పలువురు అభినందిస్తున్నారు.
వేలాది ఆకలి కడుపులకు అన్నపూర్ణగా నిలుస్తూ, రెండు వేల రోజుల నిరంతర అన్నదాన యజ్ఞాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ ప్రస్థానం సమాజంలో సేవాభావానికి ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలుస్తోంది.
మా అన్నరథం ఆకలి తీరుస్తూనే ఉంటుంది:
రోడ్లపై ఆకలితో అలమటిస్తూ అన్నం కోసం ఎదురుచూసే అనాథలు, అభాగ్యుల ఆకలి తీర్చాలనే సంకల్పంతో ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ నిరంతర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మద్దుకూరి సాయిబాబు తెలిపారు. అన్నపూర్ణగా భావించే భారతదేశంలో ఆకలితో ఎవరూ మరణించకూడదనే ఆశయంతో ప్రతిరోజూ ఆకలితో అలమటిస్తున్న వారి వద్దకే వెళ్లి అన్నం అందిస్తున్నట్లు చెప్పారు.

