కలం, వెబ్ డెస్క్: థాయ్‌లాండ్ (Thailand)లో దారుణం చోటు చేసుకుంది. ఫుకెట్ ద్వీపంలోని పటాంగ్ బీచ్ ప్రాంతంలో ఒక భవనంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 11 మంది మరణించారు. వీరిలో 8 మంది మహిళలు, ముగ్గురు పురుషులున్నారు. 36 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. టూరిస్టుల కోసం బైక్స్ అద్దెకు ఇచ్చే భవనంలో ప్రమాదం జరగడంతో 100కి పైగా వాహనాలు తగలబడిపోయాయి. వాటి నుంచి వెలువడిన విష వాయువుల కారణంగానే లోపల చిక్కుకున్నవారు స్పృహ కోల్పోయి ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది.
ఈ ఘటనకు షార్ట్ సర్క్కూట్ కారణమా..? లేక మరేదైనా ఉందా..? అనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు సీసీ టీవీలను పరిశీలించి, ప్రత్యక్ష సాక్షులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరణించినవారిలో విదేశీ పర్యాటకులు ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై థాయ్‌లాండ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

