కలం, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో ఏఐ దుష్ప్రభావం పెరుగుతుండటంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ అందించినట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన తరువాత, ఆయన సూచనలతో కిషన్ రెడ్డి ద్వారా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఒక మెమోరాండం సమర్పించాను. ఏఐని దుర్వినియోగపరచడం, డీప్ ఫేక్, డిజిటల్ దుర్వినియోగంపై తగిన చర్యలు తీసుకోవాలని అందులో కోరాను. మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ, ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా చొరవ తీసుకుంటానని చెప్పినందుకు కిషన్ రెడ్డికి ధన్యవాదాలు. వ్యక్తి గౌరవం, గుర్తింపు, కళాకారుల సృజనాత్మక హక్కులతో పాటు ప్రతి పౌరుడి భద్రత అందరి బాధ్యత. టెక్నాలజీ క్రియేటివిటీని పెంచాలి తప్ప, గౌరవానికి భంగం కలిగించకూడదు’ అని స్పష్టం చేశారు.
ఇటీవల కొందరు వ్యక్తులు డీప్ ఫేక్ టెక్నాలజీ వాడి హీరో హీరోయిన్ల అత్యంత అభ్యంతరకర రీతిలో క్రియేట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వదలడంపై తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే ఏఐ కారణంగా ఇండస్ట్రీ పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని చిరంజీవి చొరవ తీసుకుని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు పంపించాలని కోరగా.. తాజాగా కిషన్ రెడ్డి ద్వారా వాటిని కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు.

