సీజనల్ జ్వరాల పంజా.. వైద్యారోగ్యశాఖ హెచ్చరికలు

కలం, తెలంగాణ బ్యూరో: వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో సీజనల్ జ్వరాల (Seasonal Fevers)తో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నాయి. ఒకవైపు వర్షాలు, మరోవైపు చలి తీవ్రత పెరుగుతుండటంతో జ్వరాలు విజృంభిస్తున్నాయి. వైరల్‌ ఫీవర్‌, సీజనల్‌ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జ్వరాల బారినపడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరుగుతున్నది.

హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆస్పత్రితో పాటు ఇతర ప్రభుత్వ హాస్పిటళ్లలో జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో బాధపడుతూ చికిత్స కోసం వస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఫీవర్‌ ఆస్పత్రి గణాంకాలూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జూన్‌లో 10,169గా ఉన్న ఓపీ కేసులు సెప్టెంబర్‌ నాటికి 16,231కు చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో సీజనల్‌ ఫ్లూపై వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది.

3 నెలల్లో 60 శాతం పెరుగుదల..

ఫీవర్‌ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య గత మూడు నెలల్లో భారీగా పెరిగింది. ఈ ఏడాది జనవరిలో 12,912 మంది ఓపీ సేవలు పొందగా, ఫిబ్రవరిలో 12,759, మార్చిలో 11,387, ఏప్రిల్‌లో 10,297, మేలో 9,635 మంది చికిత్స కోసం వచ్చారు. జూన్‌ నుంచి కేసులు మళ్లీ పెరగడం ప్రారంభమైంది. జూన్‌లో 10,169గా ఉన్న ఓపీ సంఖ్య జులైలో 11,663కు, ఆగస్టులో 15,649కు, సెప్టెంబర్‌లో 16,231కు చేరింది. జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు మొత్తం 1,10,702 మంది ఫీవర్‌ ఆస్పత్రిలో ఓపీ సేవలు పొందారు. వాతావరణ మార్పులు, సీజనల్‌ వ్యాధుల ప్రభావంతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి.

సీజనల్‌ ఫ్లూతో అప్రమత్తం..

ఉష్ణోగ్రతలు తగ్గుతున్న నేపథ్యంలో సీజనల్‌ ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశాలపై వైద్యారోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా ఈ కాలంలో దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటికే వైరల్‌ ఫీవర్‌తో ఇబ్బందులు పడుతున్న వారికి చలి ప్రభావం మరింత సమస్యగా మారుతున్నది. ఐదేండ్లలోపు చిన్నారులు, గర్భిణులు, 65 ఏండ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు ఉన్నవారు ఇతరులకు దూరంగా ఉండాలని, అవసరమైతే మాస్కులు ధరించాలని చెబుతున్నారు.

కుక్కకాటు ఘటనలూ ఆందోళనకరమే..

జ్వరాలతో పాటు కుక్కకాటు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు రాష్ట్రవ్యాప్తంగా 29,018 కుక్కకాటు ఘటనలు నమోదయ్యాయి. అక్టోబర్‌లో రేబిస్‌తో ఇద్దరు మృతి చెందినట్లు ఆస్పత్రి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కుక్కకాటుకు గురైన వెంటనే గాయాన్ని సబ్బు, నీటితో కనీసం 15 నిమిషాల పాటు శుభ్రం చేసి, ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లాలి. వైద్యుల సూచన మేరకు రేబిస్‌ టీకాలు, అవసరమైన చికిత్స తీసుకోవాలి.

వైరల్‌ ఫీవర్‌.. డెంగ్యూ కలవరం..

  • జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. జూన్‌లో 382 మంది ఇన్‌పేషెంట్లుగా చేరగా, జులైలో 517, ఆగస్ట్లో 613, సెప్టెంబర్‌లో 665 మంది ఆస్పత్రిలో చికిత్స పొందారు.
  •  వైరల్‌ ఫీవర్‌ కేసులు ఆగస్టులో 267 ఉండగా, సెప్టెంబర్‌లో 313కు పెరిగాయి.
  •  డెంగ్యూ కేసులు జులైలో 16, ఆగస్టులో 31 ఉండగా, సెప్టెంబర్‌లో 59 నమోదయ్యాయి.
  •  అక్టోబర్‌లో వివిధ వ్యాధులతో 452 మంది ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో 202 మంది వైరల్‌ ఫీవర్‌, 73 మంది డెంగ్యూ, 32 మంది టైఫాయిడ్‌, 86 మంది అతిసార సమస్యలతో చికిత్స పొందారు.

జాగ్రత్తలే ఉత్తమం..

  • ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. దోమలు వృద్ధి చెందకుండా ఇండ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
  •  కాచి చల్లార్చిన నీరు తాగడం, వేడివేడి ఆహారం తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
  •  జ్వరం వచ్చినప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించాలి.
  •  తీవ్రమైన నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నిరంతర జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.
  •  సీజనల్‌ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్యశాఖ ప్రజలకు సూచిస్తున్నది.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>