కలం, వెబ్‌డెస్క్: తెలంగాణలో నిషేధిత ఈ-సిగరెట్లు సరఫరా (E-Cigarette Smuggling) చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఈగల్ పోలీసులకు చిక్కింది. కోల్‌కతా, హైదరాబాద్, కరీంనగర్ కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందాపై పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 31 నిషేధిత ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. చార్మినార్ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై దుస్తులు విక్రయించే ఓ వ్యక్తి కోల్‌కతాకు చెందిన సరఫరాదారు నుంచి కొరియర్ ద్వారా ఈ సిగరెట్లు తెప్పించుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. అనంతరం వాటిని కరీంనగర్‌కు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 20కి పైగా సార్లు ఈ సరఫరా జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
కరీంనగర్‌లోని ఓ కేఫ్‌లో మైనర్‌కు నిషేధిత ఈ సిగరెట్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు అక్కడ దాడి చేయడంతో ఈ అక్రమ నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై మీర్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిషేధిత వేప్స్ సరఫరా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? కోల్‌కతా నుంచి సరఫరా చేస్తున్న వ్యక్తులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ దందా నిర్వహిస్తున్నవారి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

