తొమ్మిది టైటిళ్లు.. చరిత్ర సృష్టించిన భారత్‌!

క‌లం, స్పోర్ట్స్: భారత బ్యాడ్మింటన్‌ (India Badminton) చరిత్రలో 2026 సీజన్‌ సరికొత్త రికార్డును సృష్టించింది. జపాన్‌ మాస్టర్స్‌లో లక్ష్యసేన్‌ టైటిల్‌ గెలవడంతో ఈ ఏడాది భారత్‌ ఖాతాలో తొమ్మిది వరల్డ్‌ టూర్‌ టైటిళ్లు చేరాయి. సూపర్‌ 300, అంతకంటే పైస్థాయి టోర్నీల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. గతంలో 2023లో సాధించిన ఆరు టైటిళ్లు, మూడు రన్నరప్‌ స్థానాల రికార్డును ఈసారి భారత షట్లర్లు అధిగమించారు.

జపాన్‌ మాస్టర్స్‌ ఫైనల్లో లక్ష్యసేన్‌ అద్భుతంగా పోరాడాడు. జపాన్‌ ఆటగాడు కోకి వతనాబేతో జరిగిన ఫైనల్లో తొలి గేమ్‌ కోల్పోయాడు. ఆ తర్వాత పుంజుకుని వరుసగా రెండు గేమ్‌లు గెలిచాడు. 13-21, 21-18, 21-14తో 64 నిమిషాల్లో విజయం సాధించాడు. ఈ టోర్నీని గెలిచిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు జర్మనీలో జరిగిన హైలో ఓపెన్‌లోనూ లక్ష్య విజేతగా నిలిచాడు. దీంతో వరుసగా రెండో వరల్డ్‌ టూర్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

భారత సింగిల్స్‌ విభాగంలో పీవీ సింధు, లక్ష్యసేన్‌ చెరో రెండు టైటిళ్లు గెలిచారు. సింధు జపాన్‌ ఓపెన్‌, హైలో ఓపెన్‌ టైటిళ్లు సాధించింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. లక్ష్యసేన్‌ హైలో ఓపెన్‌, జపాన్‌ మాస్టర్స్‌ టైటిళ్లతో పాటు ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరాడు. మరోవైపు కిడాంబి శ్రీకాంత్‌ యూఎస్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు.

పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ కీలక విజయాలు సాధించింది. సింగపూర్‌ ఓపెన్‌, చైనా మాస్టర్స్‌ వంటి సూపర్‌ 750 టోర్నీల్లో టైటిళ్లు గెలిచింది. థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈ జోడీ ప్రదర్శన భారత్‌ టైటిళ్ల సంఖ్య పెరగడంలో కీలక పాత్ర పోషించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>