కలం, ఖమ్మం బ్యూరో: కష్టపడి పనిచేసే కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం చెల్లించాలని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా (SK Sabir Pasha) డిమాండ్ చేశారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వెంకటేష్ ఖని కోల్‌మైన్ (వీకేసీఎం) ఓపెన్‌కాస్ట్‌లో ఓవర్‌బర్డెన్ (మట్టి పని) చేసే కాంట్రాక్ట్ కార్మికులు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించి సంపూర్ణ సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. కార్మికులకు రావాల్సిన 20 శాతం బోనస్‌ను వెంటనే చెల్లించాలని, ఇతర ఓబీ కంపెనీల తరహాలో రోజుకు రూ.950 చొప్పున 26 రోజుల వేతనం, ఆదివారం విధులకు డబుల్ మస్టర్తో పాటు ఇతర చట్టబద్ధ హక్కులు కల్పించాలని కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం మొండిగా వ్యవహరించడం తగదని, సమ్మెను విచ్ఛిన్నం చేసే చర్యలకు పాల్పడటం సరైంది కాదని అన్నారు. సమ్మె చేస్తున్నారనే కారణంతో నలుగురు కార్మికులను విధుల నుంచి తొలగించడం పూర్తిగా చట్టవిరుద్ధమని, యాజమాన్యం ఇలాంటి చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు.
సింగరేణి యాజమాన్యం, లేబర్ శాఖ తక్షణమే చొరవ తీసుకుని కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల న్యాయపోరాటానికి సిపిఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, నాయకులు సలిగంటి శ్రీనివాస్, జి. వీరస్వామి, గట్టయ్య, మార్షల్ శ్రీను, మోహన్, సత్తార్, కట్టా ఉదయ్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

